సాహిత్యం వర్సెస్ వ్యాపారం...


హైదరాబాద్ లోని N.T.R  స్టేడియంలో సురవరం గారి పుస్తక ప్రదర్శనశాలకి అత్యుత్సాహం ఆపుకోలేక మొద‌‌‌‌‍టి రోజే వెళ్ళాను.( ఆ 'అత్యుత్సాహం'తో పాటు ఫ్రెండ్స్ ముందు సొంత డబ్బా కొట్టుకోవాలన్న 'దొంగ బుద్ధి' కూడా లేకపోలేదు.)రెండు గంటలు కాల్లరిగేలా తిరిగి కేవలం రెండు పాత పుస్తకాలతో(సెకండ్ హ్యాండివి) సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పాత పుస్తకాలు కొందామన్నా సరైనవి కొన్ని కూడా లేవాయె. పాత పుస్తకాలన్నీ ఇంగ్లీషువే.యాడ నుంచి పట్టుకొచ్చారో గాని కుప్పలు కుప్పలుగా ఉన్నాయవి.అయినా కొత్తవి కొందామన్న ఆలోచనే లేదునాకసలు.ఎందుకంటే 'శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం ధర వంద రూపాయలు'.'బుచ్చిబాబు గారి 'చివరకు మిగిలేది' కూడా అంతే'.అదే సెకండ్ హ్యాండ్లో అయితే రెండూ కలిపి ఆరవైకొస్తాయి.ఇలా సెకండ్ హ్యాండ్లో కొనడం వల్ల రచయితలకి ఏ మాత్రం లాభం ఉండదని నాకు తెలుసు.అయినా గొప్ప గొప్ప రచయితలేనాడో కాలం చెందినారు.వాళ్ల రచనల ద్వారా వచ్చే డబ్బు ఎక్కడికి పోతుందనేది నా 'రెండు వేల రూపాయల' ప్రశ్న.ఆ కాపీరైట్లన్నీ ఎవరెవరి దగ్గరో వున్నాయి.వారు 'సాహిత్యా'న్ని 'వ్యాపారం'గా మారుస్తున్నారు.ఉదాహరణకి చలంగారి  రెండు మూడు రచనలన్నీ కలిపి ఓకే పుస్తకంగా మార్చి అమ్ముతున్నారు.అమ్మితే అమ్మారులే కాని 'ధర'లు దారుణంగా వున్నాయి.ఇలా చలం గారివే కావు,చాలా మంది గొప్ప గొప్ప రచనలన్నింటికీ ఇదే దుస్థితి పట్టింది.ఐదొందలు జేబులో పెట్టుకొని వెళ్లినవాడు ఇటువంటివెన్ని పుస్తకాలు కొనగలడు?తెలుగు సాహిత్యం సరైన ఆదరణే నోచుకోని ఈ రోజుల్లో అప్పటి మహానుభావుల రచనలకి అంతంత ధరలు నిర్ణయించడం ఏ మాత్రం అభినందనీయం కాదు.ఇంకా వారి రచనలను వ్యాపింపచేయవలసిన కర్తవ్యం సాహిత్యాభిమానులుగా భుజాలెగరేస్తున్న నా బోటి వారి పైన ఎంతైనా వుంది.('కొయ్ కొయ్' అనకండి).అందుకే 'ఒక కొత్త పుస్తకం కన్నా పది పాత పుస్తకాలు మిన్న'అనే నినాదంతో ముందుకు సాగుతున్నాను.

      - @రవి చంద్ర

Comments

Popular Posts