వరద గోదారి!

అమరావతి కథలు చదువుదామని మొదలేస్తే మొదటి కథ వరద కథ. నాకు ఆ కథ చదవంగనే మా ఊరి వరదే గుర్తొచ్చింది. కాకపోతే అది కృష్ణా వరద గురించి. మాది గోదావరి వరద. మామూలప్పుడు గలగలా పారుతూ గోదారి ఎంత ప్రసన్నంగా ఉంటుందో, వరదొచ్చినప్పుడు అంత ఉగ్రంగా ఉంటుంది గోదారి. (ట్విట్టర్లో గౌ బాబు ఫొటోస్ చూసి మోసపోవద్దు సరేనా 😜 ).

గోదావరి వరదంటే గోదావరి వడ్డున ఉండేటోళ్లకి గుర్తొచ్చేది
1986 గోదారే. (గుండెల్లో గోదారి సినిమాలో చూపించేది ఈ వరద గురించే). అప్పటికి మేం పుట్టలేదులే కానీ
మా పెద్ధోళ్ళని అడిగితే కళ్ళకి కట్టినట్లు చెప్తారు.

86 గోదారప్పుడు మా నాన్నకి 12 ఏళ్ళు. మా బాబుయిల ఇద్దరూ ఇంకా చిన్నోళ్లు. అప్పుడు మా నాన్న వాళ్ళు పాత ఊరు గొమ్ములో ఉండేవాళ్ళు. అప్పటి గోదావరి దెబ్బకి ఇళ్ళన్ని కొట్టుకు పోయాయంట. ఊరే దిబ్బ అయిపోయిందంట. గోదారి విడిచినంక ఆ ఒండ్రుకి ఎవరి చోటు ఎక్కడో గుర్తు తెలీకుండా అయిందంట.

అయితే అప్పుడొచ్చిన వరదకి ఆ ఊర్లో ఉన్నోళ్ళంతా కట్టు బట్టలతో దగ్గర్లో ఉన్న గుట్ట మీద చేరారంట. అక్కడ కూడా కాళ్ల దాకా వచ్చాయంట వరద నీళ్లు. అదిగో మాయిల్లు, ఇదిగో మాయిల్లు అనేటోళ్లంట వరదలో కొట్టుకుపోతున్న ఇళ్ళని చూసి. పాములు,తేళ్లు అన్నీ ఆ గుట్ట మీదకి వచ్చేవంట. కర్రతో గేదిమే టోళ్లంట వాటిని. మా తాత చెట్టెక్కి కూచున్నాడంట. కిందేమో ఇద్దరు చిన్న పిల్లల్ని ఒళ్ళో ఏస్కొని బిక్కు బిక్కు మనుకుంటా ఉందంట మా నానమ్మ. ఆ రాత్రి పూట. తెల్లారి గుట్ట మీద నుంచి ఊరోళ్ళంతా అరుస్తా ఉంటే లాంచీ వాళ్ళు చూసి మంచి వడ్డు మీద వదిలెట్టారంట. ఇదంతా ముచ్చట మా నానమ్మ చెప్పింది.

ఇప్పుడు మేము ఉండే ఇల్లు గోదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో కట్టుకున్నారు. భద్రాచలంలో 70 అడుగులు వస్తే కానీ మన ఊరు మునగదు అంటారు. మన ఊరు మునిగితే మన కంటే ముందు భద్రాచలం మునిగిద్ధి అని కూడా అంటారు.
అయితే మా పాతూరు గొమ్ము ఇంకా గోదారి గట్టునే ఉంటది. అట్ల గోదావరి గట్టున చాలా ఊర్లుంటాయి. చాలా కుటుంబాలు ఉంటాయి ఆ ఊర్లలో. మేమైతే ఏట్లో వచ్చేసినం లే కానీ, సొంతూరిని, అక్కడ దగ్గర్లో ఉండే పొలాల్ని వదిలి రాలేక ఎంత ఇబ్బందయినా అక్కడే ఉంటారు వాళ్ళు.

ప్రతీ వర్షా కాలానికి వరద బాధ తప్పదు వారికి. నాలుగు నెలల క్రితం కూడా పొంగింది గోదావరి. 86 అంత కాదులే గాని బానే వచ్చింది వరద. మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరం దాకా వచ్చింది వరద.

అయినా ఇప్పుడు 86 లోలాగా లేదు పరిస్థితి. ప్రభుత్వ యంత్రాగం ఉంది, మంచి కమ్యూనికేషన్, ఫోర్కాస్టింగ్ వ్యవస్థ, డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్లు ఉన్నాయి. ప్రాణ నష్టం అస్సలు ఉండదు. ట్రాక్టర్లలో ముందే ఇంట్లో ఉన్న సామాన్లు బయటకి తెచ్చేస్తారు. ఆ వరద ఉన్నన్ని రోజులు ప్రభుత్వం సమకూర్చే గవర్నమెంటు హాస్టళ్లలోనో, చుట్టాలు ఉన్నోలు వాళ్ళ ఇళ్లలో తల దాచుకుంటారు. మళ్లీ వరద తీసేసినంక వాళ్ళ ఊర్లు పోయి మొత్తం శుభ్రం చేసుకుంటారు. వరద బీభత్సం మామూలుగా ఉండదు కదా, గోడలంతా బురద పట్టేస్తాయి. బాత్రూములు పూర్తిగా పాడయిపోతాయి. తాటాకు ఇళ్ళు, ఇంటి ముందు తడికెలు కొట్టుకుపోతాయి. 









మొన్న వరదప్పుడు మా దగ్గర పరిస్థితి చూస్తే చాలా గమ్మత్తుగా కనిపించింది నాకు. అందరూ వరదేదో జీవితంలో భాగమైనట్లు, చాలా మామూలుగా స్పందించారు. ఎవ్వరి మొహంలో భయం కనిపించలేదు నాకు. అందరూ వారి వారి సామాన్లను ట్రాక్టర్లలో వేసుకొని వరదొస్తే ఇంతే కదా ఇంకేం చేస్తాం అన్నట్లు చాలా ప్రశాంతంగా వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు. బహుశా వరదని కూడా వాళ్ళ జీవితంలో బాగం చేసేసుకున్నారేమో!! ఎంత గుండె ధైర్యమో ఇక్కడ జనాలకి !!!



Comments

Post a Comment