శశికళ మరో జయలలిత కాగలదా?
వెన్నుముక్క లేని పన్నీర్ సెల్వం* రాజీనామా చేసి తనకి జయలలితకు జై కొట్టడం మించి ఇంకేం రాదని నిరూపించుకున్నాడు.తమిళ ప్రజలకిది ఆగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు దేశం కన్నంతా శశికళ మీదే.
జయలలిత తన ముప్పైలలో రాజకీయ ప్రవేశం చేసింది.నలబై మూడేళ్లకు మొదటిసారి ముఖ్యమంత్రి అయింది.అప్పటి తమిళుల మనస్తత్వం వేరు.రాజకీయ పరిస్థితులు వేరు.అసలు అప్పటి వారి ద్రవిడ చైతన్యమే వేరు.అంతకు ముందు రమారమి ఇరవై ఏళ్లు తమిళ సినీ పరిశ్రమలో 'మహా రాణి' తను. తమిళులు జయలలితని అంతగా ఆరాధించటానికి కారణం ఆ 'మహా రాణి' పాత్రే అని చెప్పుకోవచ్చు.ఆ ఇరవై ఏళ్లలో ఎం.జి.ఆర్,ఎన్.టి.ఆర్,శివాజీ గణేషన్,వంటి ప్రముఖులతో నటించి తమిళనాట నటిగా శిఖరాగ్ర స్థాయిని అందుకుంది.దాంతో కరుణానిధి వంటి ప్రత్యర్థి వున్నా తమిళుల ఓట్లు కొల్లగొట్టింది.ఎం.జి.ఆర్ చివరి చూపుని కూడా సరిగ్గా నోచుకోలేదు.అటువంటి స్థానం నుంచి ఆయన పార్టీలోనే ముఖ్యమంత్రి అయింది.అందుకే తమిళ వాళ్లకు పురచ్చితలైవి తను.విన్నూత్న పథకాలతో "అమ్మ" అనిపించుకుంది.
అయితే ఇక్కడ శశికళ పరిస్థితి వేరు.శశికళకి ఇప్పుడు ఆరుపదుల వయసు.తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లేదు.తను జయలలిత స్నేహితురాలు గానే అందరికీ సుపరిచతం.(అసలు జయలలిత మరణించే దాకా శశికళ అని ఒకరున్నారని సగం మంది తమిళులకు కూడా తెలీదు.)వ్యక్తిగతంగా శశికళ చిన్నమ్మ కావచ్చేమో గాని రాజకీయ పరంగా ఆమె చాలా 'చిన్న'మ్మ. ఇన్నేళ్లు పార్టీలో ఉన్నా ప్రజాప్రతినిధిగా ఒక్కసారి కూడా పోటీ చేయలేదు.ఆమె ప్రసంగం విని ఏ తమిళుడు ఓటు వేయలేదు.అలాంటిది ఆకస్మికంగా ముఖ్యమంత్రి అయిపోయింది(కాబోతుంది).అసలు నలబై అయిదేళ్ల పార్టీని నడిపించే నాయకత్వ లక్షణాలున్నాయో లేదో పార్టీ వారికే తెలియాలి.పార్టీ సంగతి సరే,పార్టీ వారు ప్రజలకిచ్చిన హామీల సంగతేంటి.ఫ్రీ ల్యాప్టాప్లు,సెల్ ఫోన్లు అబ్బో..,ఎన్నికలప్పుడు పార్టీ ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కాదు.అవన్నీ తీర్చే బాధ్యత ఇప్పుడు శశికలపై పడింది.ప్రతిపక్ష దాటిని తట్టుకోగలదా?రాజ్యసభలో పార్టీ ఉనికిని నిలపగలదా?ప్రజల మన్ననని పొందగలదా?ఇటువంటివి లక్ష ప్రశ్నలు తంబీలకి.
.
ఓ పక్క సామాజిక మాధ్యమాలలో శశికళకు వ్యతిరేఖంగా తమిళుల నిరసన మొదలైపోయింది.మేము ఓటు వేసింది జయలలితకు గాని శశికళకు కాదని కొందరు,అసలు శశికళ పోటీ చేసి MLA అయినా కాగలదా అని మరి కొందరు ఇలా రకరకాలుగా తమ నిరసన తెలుపుతున్నారు.ఈ గొంతు ప్రతిపక్షానిది కాదు,సామాన్యులది.వారి వాదనలో అర్థము,ఆర్తము లేక పోలేదు.సంవత్సరానికి ఒక సారి ఆడే జల్లికట్టు విషయంలో అంతా ఏకమై దేశాన్ని విస్మయపరిచిన తమిళతంబీలు, తమను ఐదేళ్లు పరిపాలించే ముఖ్యమంత్రి విషయంలో ఏంచేస్తారో !!
Comments
Post a Comment