వరద గోదారి!
అమరావతి కథలు చదువుదామని మొదలేస్తే మొదటి కథ వరద కథ. నాకు ఆ కథ చదవంగనే మా ఊరి వరదే గుర్తొచ్చింది. కాకపోతే అది కృష్ణా వరద గురించి. మాది గోదావరి వరద. మామూలప్పుడు గలగలా పారుతూ గోదారి ఎంత ప్రసన్నంగా ఉంటుందో, వరదొచ్చినప్పుడు అంత ఉగ్రంగా ఉంటుంది గోదారి. (ట్విట్టర్లో గౌ బాబు ఫొటోస్ చూసి మోసపోవద్దు సరేనా 😜 ). గోదావరి వరదంటే గోదావరి వడ్డున ఉండేటోళ్లకి గుర్తొచ్చేది 1986 గోదారే. (గుండెల్లో గోదారి సినిమాలో చూపించేది ఈ వరద గురించే). అప్పటికి మేం పుట్టలేదులే కానీ మా పెద్ధోళ్ళని అడిగితే కళ్ళకి కట్టినట్లు చెప్తారు. 86 గోదారప్పుడు మా నాన్నకి 12 ఏళ్ళు. మా బాబుయిల ఇద్దరూ ఇంకా చిన్నోళ్లు. అప్పుడు మా నాన్న వాళ్ళు పాత ఊరు గొమ్ములో ఉండేవాళ్ళు. అప్పటి గోదావరి దెబ్బకి ఇళ్ళన్ని కొట్టుకు పోయాయంట. ఊరే దిబ్బ అయిపోయిందంట. గోదారి విడిచినంక ఆ ఒండ్రుకి ఎవరి చోటు ఎక్కడో గుర్తు తెలీకుండా అయిందంట. అయితే అప్పుడొచ్చిన వరదకి ఆ ఊర్లో ఉన్నోళ్ళంతా కట్టు బట్టలతో దగ్గర్లో ఉన్న గుట్ట మీద చేరారంట. అక్కడ కూడా కాళ్ల దాకా వచ్చాయంట వరద నీళ్లు. అదిగో మాయిల్లు, ఇదిగో మాయిల్లు అనేటోళ్లంట వరదలో కొట్టుకుపోతున్న ఇళ్ళని చూసి. పాములు,...